Loading File
Initializing...
Chapter 24
Turning the page...
Continue your journey — select a new file
Double-tap to translate this word.
కాశీలో తనలో తాను మళ్లీ పుట్టినట్టుగా అనిపించిన తర్వాత...
జనార్దన్ ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది...కానీ ఈ కథలో మరో వైపు...
హైదరాబాద్‌లోని ఆ చిన్న రూమ్‌లో...
తేజ మాత్రం పూర్తిగా వేరే యుద్ధం చేస్తున్నాడు..
మధ్యాహ్నం సమయం...
గదిలో ఫ్యాన్ శబ్దం తప్ప ఇంకేమీ వినిపించడం లేదు.
కంప్యూటర్ స్క్రీన్ ముందు కూర్చుని తేజ వీడియో ఎడిటింగ్‌లో మునిగిపోయాడు...టైమ్‌లైన్ మీద క్లిప్స్ కట్ చేస్తూ.....ఆడియో సింక్ చేస్తూ....రెండో మానిటర్‌లో రెండరింగ్ చూస్తూ...చాలా సీరియస్‌గా పని చేస్తున్నాడు.
అప్పటికే ఉదయం నుంచి వరుసగా క్లయింట్ల ఫోన్లు వస్తున్నాయి.
ఒకడు వీడియో ఎప్పుడు ఇస్తావ్ అంటాడు.
మరొకడు రీల్ మార్చమంటాడు.
ఇంకొకడు "ఇంకాస్త సినిమాటిక్‌గా చేయండి బ్రో" అంటాడు...
దాంతో తేజ చిరాకు పీక్‌కి చేరుకుంది.
అప్పుడే...మరో కాల్ వచ్చింది.
Unknown Number
తేజ విసుగ్గా ఫోన్ ఎత్తాడు.
"సార్... మీ వీడియోనే ఎడిట్ చేస్తున్నా , మా వాడు కూడా లేడు, నేను ఒక్కడినే ఎన్ని పనులు చేస్తానో చెప్పండి, రెండర్ అవ్వడానికి కూడా టైమ్ పడుతుంది కదా!"
అని కోపంగా అన్నాడు.
అవతల కొద్దిసేపు నిశ్శబ్దం.
తర్వాత ఒక మహిళా స్వరం వినిపించింది.
"బాబు...నేను జనార్దన్ పిన్ని మాట్లాడుతున్నాను."
ఆ మాట విన్న క్షణంలో తేజ కుర్చీలో నిటారుగా కూర్చున్నాడు.
"అయ్యో ఆంటీ... మీరా! సారీ ఆంటీ ,క్లయింట్ అనుకుని మాట్లాడేశాను."
అవతల నుంచి ఆమె మృదువుగా అంది.
"పర్లేదు బాబు."
"జనార్దన్ ఫోన్ వారం రోజుల నుంచి పని చేయడం లేదు ,ఒక్కసారి వాడికి ఇస్తావా?, వాడి అమ్మమ్మ చాలా కంగారు పడుతోంది."
ఆ మాట విన్న వెంటనే...
తేజ ముఖంలో ఉన్న నవ్వు మాయమైంది.
ఎందుకంటే...
జనార్దన్ ఎక్కడున్నాడో తనకే తెలియదు.
---
ఒక్క క్షణం ఏం చెప్పాలో అర్థం కాలేదు.
---
"జనార్దన్..."
అని మొదలుపెట్టాడు.
"పని మీద..."
మాట మధ్యలో ఆగిపోయింది.
"ముంబై వెళ్లాడు ఆంటీ...."కొంచెం షూటింగ్ పని ఉంది...వచ్చాక తప్పకుండా ఫోన్ చేయమని చెప్తాను."
అని అబద్ధం చెప్పేశాడు.
అవతల ఆమె కొంత ఊరటతో,
"సరే బాబు,చెప్పు."...అని కాల్ పెట్టేసింది.
ఫోన్ కట్ అయిన వెంటనే...
తేజ కుర్చీలో వెనక్కి వాలిపోయాడు.
తల పట్టుకున్నాడు.
"రేయ్ జనార్దన్...ఎక్కడున్నావ్ రా నువ్వు..."
అని నిరాశగా అన్నాడు.
ఇప్పటి వరకు అతనికి ఒక్క విషయం మాత్రమే తెలుసు.
జనార్దన్ ఎక్కడికో వెళ్లాడు.
---
కానీ ఎక్కడికి?
ఎందుకు?
ఎప్పుడు వస్తాడు?
ఏమీ తెలియదు.
అప్పుడే...
గదిలోకి వచ్చిన గాలి టేబుల్ మీద ఉన్న ఆ ఉత్తరాన్ని కదిలించింది.....అది ఎగిరి వచ్చి నేరుగా తేజ కాళ్ల దగ్గర పడింది.
"అయ్యో!, ఈ లెటర్ సంగతి పూర్తిగా మర్చిపోయా."
అని దాన్ని ఎత్తుకున్నాడు.
ఇప్పటివరకు అసలు తెరవలేదు కూడా.
ఆసక్తిగా కవర్ చింపి లోపల ఉన్న లెటర్ బయటకు తీశాడు.
మొదట చదవడం మొదలుపెట్టాడు.
ఒక లైన్...
రెండు లైన్లు...
మూడు లైన్లు...
చదువుతున్న కొద్దీ అతని కళ్ళు పెద్దవయ్యాయి.
"ఏంట్రా ఇది?"
అని మళ్లీ మొదటి నుంచి చదివాడు.
ఆ ఉత్తరం ఒక సినీ నిర్మాణ సంస్థ నుంచి వచ్చింది.
అందులో...
Hero నాని నిర్మాణంలో రూపొందుతున్న ఒక కొత్త చిత్రానికి...
కెమెరా విభాగంలో సహాయక సినిమాటోగ్రాఫర్‌గా...
జనార్దన్ ఎంపికయ్యాడని ఉంది....కొన్ని క్షణాలు తేజ నమ్మలేకపోయాడు.....తర్వాత ఒక్కసారిగా కుర్చీ నుంచి లేచి గంతులేశాడు.
"వచ్చేసింది రా!"
"వచ్చేసింది!"
"ఇన్ని ఏళ్లుగా కలగన్న ఛాన్స్ వచ్చేసింది!"
అని ఆనందంతో అరిచాడు.
జనార్దన్ ఎన్నో రాత్రులు కెమెరా పట్టుకుని తిరిగిన రోజులు గుర్తొచ్చాయి....వర్షంలో షూట్ చేసిన షార్ట్ ఫిల్మ్స్...
ఎవరూ గుర్తించని ఫోటోలు...పగలు పని చేసి...
రాత్రి ఎడిటింగ్ చేసిన కష్టాలు...
అన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చాయి.
"వీడు చూసుంటే ఎగిరిపోయేవాడు!"
అని నవ్వుకున్నాడు...వెంటనే ఫోన్ తీసుకున్నాడు.
జనార్దన్‌కి చెప్పాలి....ఇప్పుడే చెప్పాలి....అని కాల్ చేశాడు..
కొన్ని సెకన్లు...
తర్వాత ఫోన్‌లో ఒకే మాట వినిపించింది.
"The number you are trying to call is switched off."
తేజ ఒక్కసారిగా ఆగిపోయాడు...అప్పుడే గుర్తొచ్చింది.
జనార్దన్ తన సిమ్ కార్డ్ పారేసిన విషయం...తేజ ముఖం మళ్లీ వేలాడిపోయింది.
"ఛీ...వీడి పిచ్చి...వీడి దరిద్రానికి ఇలాంటి మంచి విషయాలు జరగడం ఏంట్రా బాబు!" అని తల పట్టుకున్నాడు.
కొద్దిసేపటి తర్వాత ఒక్కసారిగా ఆలోచించాడు
"అయినా...నాకు చెప్పకుండా సినిమా వాళ్లని ఎప్పుడు కలిసాడు?" అని ఆశ్చర్యపోయాడు.
తర్వాత నవ్వుకున్నాడు.
---
"అయ్యో! Natural star నాని కదా ,అందరికీ అవకాశం ఇస్తారు, అఫ్టర్ ఆల్..ఒక జనార్దన్‌కి ఇవ్వలేరా?" అని అనుకున్నాడు.
కానీ వెంటనే మరో సమస్య గుర్తొచ్చింది.
జనార్దన్‌కి ఈ విషయం ఎలా చెప్పాలి?
అదే ఇప్పుడు అతని ముందు ఉన్న పెద్ద ప్రశ్న.
మరో వైపు...
హిమాలయాల ఒడిలో...
అదే సమయంలో...
జనార్దన్ మాత్రం వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు.
ఇప్పుడు అతని ప్రయాణం కేదార్‌నాథ్ ఆలయం వైపు సాగుతోంది.
---
హిమాలయాల మధ్యలో...
మంచు పర్వతాల ఒడిలో...
మేఘాలు భూమిని తాకుతున్నట్టుగా కనిపించే ప్రదేశం.
చుట్టూ తెల్లటి మంచు.
గాలి అంత చల్లగా ఉంది...
ప్రతి శ్వాస కూడా కనిపిస్తోంది.
దూరంగా మంచుతో కప్పబడిన శిఖరాలు...
వాటి వెనుక నుంచి ఉదయిస్తున్న సూర్యుడు...
గాలిలో "హర హర మహాదేవ్" నినాదాలు...
అలసిపోయిన యాత్రికులు...
భక్తితో నిండిన ముఖాలు...
అన్నీ కలిసి ఆ ప్రదేశాన్ని భూమిపై ఉన్న స్వర్గంలా మార్చేశాయి.
జనార్దన్ నెమ్మదిగా కొండ దారిలో నడుస్తున్నాడు.
ఈసారి అతని చేతిలో కెమెరా ఉంది.
చాలా రోజుల తర్వాత...
అతను మళ్లీ ఫోటోలు తీస్తున్నాడు.
మంచు మీద పడుతున్న సూర్యకిరణాలు...కొండల మధ్య దూసుకెళ్తున్న మేఘాలు...గంటల ధ్వనులు..యాత్రికుల ముఖాల్లో కనిపిస్తున్న భక్తి...తన కెమెరాలో బంధిస్తున్నాడు.
కొన్ని క్షణాలు...తన బాధలను కూడా మర్చిపోయాడు.
ఎందుకంటే...హిమాలయాల ముందు మనిషి బాధలు కూడా చాలా చిన్నవిగా కనిపిస్తాయి.
కొండ శిఖరాల వైపు చూస్తూ అతను మనసులో అనుకున్నాడు.
"ప్రపంచం ఇంత పెద్దది..."
"అయితే నేను ఇంతకాలం నా బాధల చుట్టూనే ఎందుకు తిరిగాను?"
దూరంగా...
మంచు మేఘాల మధ్య...
కేదార్‌నాథ్ ఆలయ శిఖరం కనిపించింది.
ఆ క్షణంలో...
అతనికి తెలియదు...తన జీవితాన్ని మార్చే వార్త...
తన కోసం ఎదురుచూస్తూ....హైదరాబాద్‌లోని ఒక చిన్న గదిలో...ఒక ఉత్తరంగా పడిఉందని
Jaya Janardana
By Ajay
Published: June 12, 2026 at 5:26 AM
Your input calibrates the database for others.
Ready to play...