Loading File
Initializing...
Chapter 23
Turning the page...
Continue your journey — select a new file
Double-tap to translate this word.
ఎవరికీ చెప్పకుండా...తేజకి కూడా పూర్తి వివరాలు చెప్పకుండా...ఒక బ్యాగ్ భుజానికి వేసుకున్నాడు.
---
ఈసారి అతనికి గమ్యం లేదు.
ప్రణాళిక లేదు.
ఎక్కడికి వెళ్లాలో కూడా నిర్ణయం లేదు.
---
కేవలం...తన నుంచి తాను కొంత దూరం వెళ్లాలని మాత్రమే అనిపించింది.
---
అలా నగర వీధుల్లో నడవడం మొదలుపెట్టాడు.
ఆకాశం మబ్బులతో నిండిపోయి ఉంది.
గాలి కూడా ఏదో మార్పు రాబోతోందని సూచిస్తున్నట్టు వీచుతోంది.
---
కొన్ని నిమిషాలు గడవగానే వర్షం మొదలైంది.
మొదట చినుకులు...తర్వాత కాస్త వేగంగా...
---
జనార్దన్ వెంటనే చుట్టూ చూశాడు...పక్కనే ఒక చిన్న కిళ్లీ కొట్టు కనిపించింది.
పాత టిన్ షీట్ కప్పు.
ముందు వేలాడుతున్న బిస్కెట్ ప్యాకెట్లు...లోపల ఒక చిన్న టీవీ...
వర్షం నుంచి తప్పించుకోవడానికి అక్కడికి వెళ్లి నిలబడ్డాడు.
ఆ సమయంలో టీవీలో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం వస్తోంది.
అందులో ప్రవచనం చెబుతున్నది చాగంటి కోటేశ్వరరావు.
ఆయన స్వరం ప్రశాంతంగా వినిపిస్తోంది.
“కాశీకి వెళ్లడం అనేది ఒక యాత్ర కాదు...”
“అది మనిషి తన అహంకారాన్ని దించిపెట్టే ప్రయాణం...”
“అక్కడ శివుడు మనిషికి ఒక విషయం నేర్పుతాడు...”
“నువ్వు శాశ్వతం కాదని...”
జనార్దన్ తెలియకుండానే ఆ మాటలు వింటున్నాడు.
ఆ ప్రవచనం మొత్తం వారణాసి మహాత్మ్యం గురించే ఉంది.
“జీవితం అంటే ఏమిటో తెలుసుకోవాలంటే కాశీకి వెళ్లు...”
“మరణం అంటే ఏమిటో తెలుసుకోవాలంటే కూడా కాశీకి వెళ్లు...”
“అప్పుడు నీకు నువ్వు ఎవరో తెలుస్తుంది...”
ఆ మాటలు జనార్దన్ గుండెల్లో ఎక్కడో లోతుగా తాకాయి.
ఎందుకో...
ఎలా జరిగిందో అతనికే తెలియదు...
కానీ ఆ క్షణంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు.
"నేను కాశీకి వెళ్తాను." అని అనుకున్నాడు జనార్దన్
---
కొన్ని రోజుల ప్రయాణం తర్వాత
జనార్దన్ వారణాసి నగరంలో అడుగుపెట్టాడు.
ఆ నగరం వేరుగా అనిపించింది...అక్కడ కాలమే నెమ్మదిగా నడుస్తున్నట్టు ఉంది.
సన్నని వీధులు...వేల సంవత్సరాల చరిత్ర...
ఓం నమఃశివాయ అనే నినాదాలు...
గంటల ధ్వనులు...అగరబత్తుల సువాసన...
అక్కడ ప్రతి రాయి ఏదో కథ చెబుతున్నట్టుంది.
మొదటగా అతను కాలభైరవ ఆలయం వెళ్లాడు.
అక్కడ నిలబడి ఉండగా....తనలో ఉన్న భయాలు, బాధలు, పశ్చాత్తాపాలు అన్నీ బయటకు వస్తున్నట్టుగా అనిపించింది.
తర్వాత వారాహి అమ్మవారి ఆలయం దర్శించాడు.
మరిన్ని ఘాట్లు తిరిగాడు....గంగానది ఒడ్డున గంటల తరబడి కూర్చున్నాడు.
మొదటిసారి...
ఎవరి గురించి ఆలోచించకుండా...ఏమీ మాట్లాడకుండా...
కేవలం నిశ్శబ్దాన్ని వింటూ గడిపాడు.
---
ఒకరోజు సాయంత్రం...గంగ ఒడ్డున కూర్చుని ఉండగా...
ఒక సాధువు అతని పక్కన వచ్చి కూర్చున్నాడు.
తెల్లటి గడ్డం....నుదుటిపై విభూది.
ప్రశాంతమైన చూపు.
ఆయన జనార్దన్ వైపు చూసి చిరునవ్వు నవ్వాడు.
---
“ఎవరినుంచి పారిపోతున్నావు?”
అని అడిగాడు ఆ సాధువు .
ఆ ప్రశ్న విన్న జనార్దన్ ఆశ్చర్యపోయాడు.
“నేను పారిపోవడం లేదు.”
అన్నాడు జనార్దన్....సాధువు మళ్లీ నవ్వాడు.
“అందరూ అదే అంటారు కానీ మనిషి బయట ప్రపంచం నుంచి ఎప్పుడూ పారిపోడు...తన ఆలోచనల నుంచే పారిపోతాడు.” అని చెప్పడం మొదలు పెట్టాడు ఆ సాధువు జనార్దన్ మౌనంగా ఉన్నాడు.
కొద్దిసేపటి తర్వాత సాధువు అన్నాడు.
"జీవితం ఒక చక్రం , అందరూ తమ తమ కర్మలను అనుభవించడానికి పుడతారు నువ్వూ అందుకే పుట్టావు , ఎందుకు ఇలా జరిగింది, నాకే ఎందుకు ఇలా జరుగుతోంది? అని బాధపడకు, ఇది నా కర్మ అని అంగీకరించు, అప్పుడు బాధ సగం తగ్గిపోతుంది,మిగతాది...” అని ఆ మాట అని
ఆయన ఆకాశం వైపు చూసి చిరునవ్వు నవ్వాడు.
"ఆ శివయ్యకి వదిలేయ్.” అని అన్నాడు ఆ సాధువు
ఆ మాటలు జనార్దన్ మనసులో బలంగా నాటుకుపోయాయి.
అతను మొదటిసారి...కొంత తేలికగా అనిపించుకున్నాడు.
అలా రోజుకి ఒక గుడికి లేదా ఊరకనే కాశి లో తెరుగుతూ ఉండే వాడు సాయంత్రం ఐతే గంగా హారతి చూడడానికి వెళ్ళే వాడు , కొత్త కొత్త పరిచయాలు, కొత్త భాష అలా ఎన్నో నేర్చుకున్నాడు , జీవితం చిన్నదే కానీ చూడాల్సిన ప్రపంచం ఎంతో పెద్దది అని గ్రహించాడు.
మణికర్ణికా ఘాట్
కాశీలో గడిపిన ఆ వారం రోజుల్లో...
అతని జీవితాన్ని పూర్తిగా మార్చిన ప్రదేశం ఒకటే.
మణికర్ణికా ఘాట్
ఒక సాయంత్రం...ఆ సాధువు అతన్ని అక్కడికి తీసుకెళ్లాడు.
అక్కడ...ఎప్పుడూ అగ్ని ఆరదు....ఒక చితి కాలిపోతుంటే...
మరో శవం వస్తుంది...ఒక కుటుంబం ఏడుస్తుంటే...
మరో కుటుంబం చివరి వీడ్కోలు చెబుతోంది.
అక్కడ జీవితం, మరణం మధ్య ఉన్న గీత కనిపించదు.
జనార్దన్ నిశ్శబ్దంగా నిలబడి కాలుతున్న చితులను చూస్తున్నాడు.
అప్పుడు సాధువు అడిగాడు.
“ఏం చూస్తున్నావు?"
జనార్దన్ సమాధానం చెప్పలేదు.
ఆయన నెమ్మదిగా అన్నాడు.
"నీ ఆత్మకి ఏడు జన్మలు ఉండొచ్చు డెబ్బై జన్మలు ఉండొచ్చు ...కానీ...ఈ జనార్దన్‌కి మాత్రం ఒకటే జన్మ , ఆత్మ కర్మ కోసం వచ్చింది ,మరి జనార్దన్ ఎందుకు వచ్చాడు?, ఇప్పటివరకు జనార్దన్ కోసం నువ్వు ఏం చేశావు?” అని ప్రశ్నించాడు ఆ సాధువు ,
ఆ ప్రశ్న అతని గుండెని తాకింది.
ఇప్పటివరకు....తన బాధల కోసం బ్రతికాడు.
తన భయాల కోసం బ్రతికాడు.
ఇతరులు ఏమనుకుంటారో అనే ఆలోచనల కోసం బ్రతికాడు.
కానీ...
తన కోసం మాత్రం ఎప్పుడూ బ్రతకలేదు.
సాధువు మళ్లీ అన్నాడు.
“సంసారం అనే సముద్రంలో మునిగిపోకు , నీ హృదయాన్ని అడుగు, నీకోసం నువ్వు ఏం చేశావో అడుగు, ఇంకా...కాశీ విశ్వనాథుడిని దర్శించే సమయం వచ్చింది.”
అని చెప్పాడు అని అన్నాడు ఆ సాధువు
వాళ్లు మణికర్ణికా ఘాట్ పక్కనున్న ఆ ఇరుకు వీధుల్లో నడవడం ప్రారంభించారు.
అదే సమయంలో...
కొన్ని శవాలు వాళ్ల పక్కనుండి వెళ్తున్నాయి.
“రామ్ నామ్ సత్య హై...” అనే నినాదాలు వినిపిస్తున్నాయి.
జనార్దన్ ఆ దృశ్యాలను చూస్తూ నడుస్తున్నాడు.
అప్పుడు అతని మనసులో ఒక ఆలోచన పుట్టింది.
"జీవితంలో ఎంత సంపాదించినా..."
"ఎంత ప్రేమించినా..."
"ఎంత బాధపడినా..."
"చివరికి అందరూ ఇక్కడికే వస్తారు."
మరొక ఆలోచన వెంటనే వచ్చింది.
"కానీ మరణం కాదు మనిషిని గుర్తుంచేది."
"అతను ఎలా జీవించాడో అదే గుర్తుంటుంది."
"అది కూడా కొన్ని సంవత్సరాల తర్వాత కాలగర్భంలో కలిసిపోతుంది."
"అంటే... మన అస్తిత్వం కూడా శాశ్వతం కాదు." అని అనుకున్నాడు జనార్దన్ మనసులో
అతను కాసేపు ఆగి మరోసారి కాలుతున్న చితుల వైపు చూశాడు.
"అయితే నేను ఎందుకు ఇంతకాలం ఇతరుల అభిప్రాయాల కోసం బాధపడ్డాను? , ఎందుకు నేను నన్ను నేను శిక్షించుకున్నాను?"
"ఎందుకు నా జీవితాన్ని ఇతరుల కథలతో కొలిచాను?"
అతని కళ్లలో తొలిసారి ప్రశాంతత కనిపించింది.
ఆ చితుల అగ్నిలో...
జనార్దన్ తన బాధలను కాలిపోతూ చూసాడు.
ఆ పొగలో...
తన అహంకారం కరిగిపోతూ చూసాడు.
ఆ గంగ గాలిలో...
తన హృదయం మళ్లీ శ్వాస తీసుకోవడం నేర్చుకుంది.
ఆ రాత్రి కాశీ ఆకాశం కింద నిలబడి జనార్దన్ ఒక విషయం అర్థం చేసుకున్నాడు.
జీవితం అంటే ప్రేమను పొందడం కాదు.
బాధను తప్పించుకోవడం కాదు...విధిని గెలవడం కూడా కాదు.
జీవితం అంటే...మనకు వచ్చిన ప్రతి అనుభవాన్ని అంగీకరించి,
మనల్ని మనం కోల్పోకుండా ముందుకు నడవడం...మరుసటి రోజు ఉదయం...
అతని ముందున్న దారి ఇంకా తెలియదు.
కానీ ఈసారి...
అతను దారిని వెతకడం లేదు.
తనను తాను కనుగొనడం ప్రారంభించాడు.
Jaya Janardana
By Ajay
Published: June 11, 2026 at 6:40 AM
Your input calibrates the database for others.
Ready to play...