Loading File
Initializing...
Chapter 1
Turning the page...
Continue your journey — select a new file
Double-tap to translate this word.
గోదావరి నదీ తీరం... సమయం సాయంత్రం ఐదు కావస్తోంది. అస్తమిస్తున్న సూర్యుని లేత కిరణాలు అలల మీద పడి, పారుతున్న గోదావరి కరిగించిన బంగారంలా దగదగా మెరుస్తోంది. వెనక పురాతనమైన గుడి, ముందు ప్రశాంతంగా పారుతున్న నది. ఆ వాతావరణానికి ప్రతిరూపంలా ఆకుపచ్చని సంప్రదాయ చీరకట్టులో ఉన్న ఓ అమ్మాయి అక్కడ ఉన్న సిమెంట్ బెంచీ మీద ఒంటరిగా కూర్చుని ఉంది. సూర్యకాంతిలో ఆమె చెవికున్న జుంకీ తళుక్కుమంటోంది.
ప్రకృతి ఎంతో ప్రశాంతంగా ఉన్నా, ఆ అమ్మాయిలో మాత్రం ఆ ప్రశాంతత లేదు. ఆమె చూపులు నదీ ప్రవాహం మీదే స్థిరపడిపోయాయి. కళ్లలో ఏదో తెలియని ఆందోళన, ఎవరికీ చెప్పుకోలేని మూగబాధ. తనలో తానే తీవ్రంగా మదనపడుతోంది.
"కాలం కూడా ఈ నదీ ప్రవాహం లాంటిదేనేమో... ఎవరి కోసమూ ఆగకుండా పరుగులు తీస్తూనే ఉంటుంది..." ప్రవహిస్తున్న నీటిని చూస్తూ మనసులోనే అనుకుంది. "ముకుంద్‌ను చూసి అప్పుడే ఆరు నెలలవుతోంది. నాతో మొదటిసారి మాట్లాడటానికి అతను పడిన పాట్లు చూసి ఎంత నవ్వుకున్నానో! మాట్లాడాలంటేనే అంత భయం, నేను పలకరిస్తే కనీసం కళ్ళలోకి చూసేవాడు కాదు... కానీ ఇప్పుడు, కాలం ఎంత మారిపోయింది!"
ఆమె ఆలోచనల పరంపరను ఛేదిస్తూ "ఆద్యా..." అంటూ వెనక నుంచి ఓ పిలుపు వినిపించింది.
"ఆ... వస్తున్నానమ్మా!" అంటూ ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది ఆద్య. బహుశా వాళ్ల అమ్మగారితో కలిసి గుడికి వచ్చినట్లుంది.
ఆద్య దగ్గరకు వచ్చిన ఆమె తల్లి శారదాదేవి, "పంతులుగారు నీ జాతకంలో ఏదో దోషం ఉందని చెప్పారు ఆద్యా... వచ్చే శనివారం ఇంట్లో పూజ పెట్టుకుందాం. అన్నట్టు, నీ ఇంటర్వ్యూ ఏమైంది?" అని అడిగింది.
"అబ్బా... నాకిప్పుడు ఆ ఇంటర్వ్యూల మీద ఎలాంటి ఆసక్తీ లేదు అమ్మా!" విసుగ్గా సమాధానమిచ్చింది ఆద్య.
ఆ మాటలకు శారదాదేవి గొంతులో కాస్త కఠినత్వం దొర్లింది. "చూడు ఆద్యా... ఆ ముకుంద్‌ను ఇక మర్చిపో. కనీసం నీతో ఒక్క మాటైనా చెప్పకుండా అలా వెళ్లిపోయాడంటే, నీ మీద అతనికి ఎలాంటి ప్రేమా లేనట్టే కదా? కాస్త వాస్తవంలోకి రా. ఒక తల్లిలా కాకుండా మంచి స్నేహితురాలిగా చెబుతున్నాను. నా స్నేహితురాలు ప్రభావతి వాళ్ల అబ్బాయి లండన్‌లో జాబ్ చేస్తున్నాడు. నిన్ననే వాళ్లతో మాట్లాడాను. పిల్లాడు చాలా బాగున్నాడు..."
మాట పూర్తికాకముందే ఆద్య అడ్డుపడింది. "నాకు ఆ పెళ్లి ఇష్టం లేదు! అయినా ముకుంద్ నాతో ఏమీ చెప్పకుండా వెళ్ళాడంటే, వెనుక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. నా ముకుంద్ మోసం చేసే రకం కాదు!" చిరాకుగా, అంతే గట్టిగా చెప్పేసింది.
కూతురి తీరుతో శారదాదేవికి కోపం కట్టలు తెంచుకుంది. "నోరు మూయ్! పిచ్చిదానిలా మాట్లాడకు. ఎదిగిన ఆడపిల్ల కదా అని నెమ్మదిగా చెబుతుంటే నా చనువును చొరవగా తీసుకోకు!" అంటూ తీవ్రంగా మందలించింది.
ఇక లాభం లేదనుకున్న ఆద్య మారుమాట్లాడకుండా నడుచుకుంటూ వెళ్లి కారు స్టార్ట్ చేసింది. ఆమె పక్క సీట్లో కోపంగా కూర్చుంది శారదాదేవి. ప్రయాణం మౌనంగా సాగుతోంది, ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండా ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలుతోంది.
స్టీరింగ్ పట్టుకున్న ఆద్య మనసు మాత్రం గతంలోకి జారుకుంది. "నాకు కాలేజీ రోజులే బాగుండేవి... అసలు ముకుంద్‌ను కలవడమే ఒక విచిత్రం. అసలు నిజం నీకెలా చెప్పగలను అమ్మా..." అని మనసులోనే కుమిలిపోయింది.
అసలు ఎవరు ఆ ముకుంద్? ఏంటి వీళ్ల కథ?
Shunyam
By Storytravel
Published: February 26, 2026 at 2:36 PM
Your input calibrates the database for others.
Ready to play...