SCREEN ON

Directory

01

Episode - 1

02

Episode - 2

Active
Chapter // 02

Episode - 2

Mahendra Jannu _Mj
Emotional Family Drama
1 Min Read
Pub: Jul 3, 2026

మురళీకృష్ణని ఒక్కసారిగా కాల చక్రంలో వెనక్కి లాగేసింది. తన సొంత పల్లెటూరు 'శ్రీరామపురం' కళ్లముందు కదలాడింది.మురళీకృష్ణకి వాళ్ల నాన్న 'మాధవయ్య' గుర్తొచ్చాడు.

ఆరుగురు సంతానం ఉన్న ఆ పెద్ద కుటుంబంలో... ముగ్గురు అక్కల తర్వాత పుట్టిన పెద్ద మగపిల్లాడు మాధవయ్య. ఆ తర్వాత ఇద్దరు తమ్ముళ్లు. ఇంట్లో అమ్మానాన్న ముద్దుగా, బాధ్యతగా 'పెద్దోడా' అని పిలిచేవాళ్లు. ఊర్లో వాళ్లకి కూడా ఆయన 'పెద్దోడే'. కానీ ఆ 'పెద్దోడు' అనే పేరుతో పాటు... ఆ చిరుప్రాయంలోనే ఇంటి నిండా ఉన్న బాధ్యతల పనులన్నీ ఆయన భుజాల పైకొచ్చి పడ్డాయి. తాతగారేమో రాజకీయం అంటూ తిరుగుతూ, ఉన్న పొలాన్ని అమ్ముకుంటూ వస్తుంటే... మాధవయ్యకి ఊహ తెలిసేసరికే ముగ్గురు అక్కల పెళ్లిళ్లు అయిపోయాయి. మిగిలిన కుటుంబ పోషణకు తానే ఆధారం అని అర్థమైంది. అందుకే, కేవలం 5వ తరగతి చదువుతుండగానే... చేతిలో ఉన్న పుస్తకాలు పక్కన పడేసి, పలుగు-పారా పట్టి పొలం బాట పట్టాడు ఆ 'పెద్దోడు'.

కష్టపడటం తప్ప మరో ఆలోచన లేని ఆ తండ్రికి... యుక్త వయస్సు రాగానే 'విశాలాక్షి' అనే అమ్మాయితో పెళ్లి చేశారు. ఆవిడ మాట్లాడితే గడసరిగా, గంభీరంగా ఉంటుంది కానీ... లోపల మాత్రం పరమ అమాయకురాలు. ఆ అమాయకత్వం ఆవిడకే తెలియదు.

పెళ్లయ్యాక కూడా మాధవయ్య తలరాత మారలేదు. తమ్ముళ్ల చదువులు, కుటుంబ పోషణ కోసం రక్తాన్ని చెమటగా మారుస్తూ కష్టపడ్డాడే తప్ప... తన పెళ్లి సమయానికి ఒక్క రూపాయి కూడా దాచుకోలేకపోయాడు. ఆర్థిక పరిస్థితి ఎప్పుడూ అంతంత మాత్రమే!

అలాంటి పేదరికంలో పుట్టి పెరిగాడు మురళీకృష్ణ.

స్కూల్‌కి వెళ్లేటప్పుడు తోటి పిల్లలంతా మంచి బ్యాగులు తగిలించుకుని వస్తుంటే... మురళీకృష్ణ మాత్రం పొలానికి మందు కొట్టే సంచులతో కుట్టిన చేతి సంచిలో పుస్తకాలు పెట్టుకుని వెళ్లేవాడు. ఒంటి మీద చిరిగిన చొక్కా... కాళ్లకేమో అరిగిపోయిన చెప్పులు. ఆ చెప్పుల పట్టీలు తెగిపోతే.. దానికి పిన్నీసులు గుచ్చుకుని నడిచేవాడు.

అది మురళీకృష్ణ 5వ తరగతి చదువుతున్న రోజులు...

ఒకరోజు క్లాస్‌రూమ్ నిండా పిల్లలున్నారు. సరిగ్గా సార్ బోర్డు మీద లెక్కలు చెప్తుంటే... మురళీకృష్ణ కాళ్ల కదలికకి ఆ చెప్పుకున్న పిన్నీసు ఊడిపోయింది. ఒక్కసారిగా ఆ పాత చెప్పు తెగి పక్కకు పడింది. ఆ శబ్దానికి క్లాస్‌లో ఉన్న పిల్లలందరూ మురళీకృష్ణ వైపు చూశారు.

ఆ చిరిగిన చొక్కా, మందు సంచి బ్యాగు, ఇప్పుడు తెగిపోయిన ఆ అతుకుల చెప్పు... అన్నీ చూసి క్లాస్‌రూమ్‌లో ఉన్న పిల్లలందరూ ఒక్కసారిగా గట్టిగా నవ్వడం మొదలుపెట్టారు. ఆ నవ్వులు మురళీకృష్ణ గుండెల్లో బాణాల్లా గుచ్చుకున్నాయి.

అవమానంతో, సిగ్గుతో మురళీకృష్ణ ముఖం మాడిపోయింది. కళ్లల్లోంచి నీళ్లు తిరుగుతున్నా బయటకి పడకుండా... ఆ రోజు స్కూల్ అయిపోయి బెల్ కొట్టే వరకు తల పైకెత్తలేదు. ఎవరితోనూ ఒక్క ముక్క మాట్లాడలేదు. కళ్లల్లో నీళ్లతో అలాగే బెంచీకేసి చూస్తూ కూర్చుండిపోయాడు.

సాయంత్రం స్కూల్ వదలగానే... కాళ్లకు చెప్పులు లేకుండా, ఆ మండుతున్న పల్లెటూరి మట్టి రోడ్డు మీద ఏడుస్తూ ఇంటికి పరిగెత్తాడు. గుమ్మంలోనే ఆ తెగిపోయిన చెప్పులని విసిరికొట్టాడు.

పొలం పని ముగించుకుని, ఒళ్లంతా మట్టితో అలిసిపోయి కూర్చున్న తండ్రి మాధవయ్య ఎదురుగా నిలబడి... ఏడుస్తూ గట్టిగా అరిచాడు మురళీకృష్ణ—

"నా ఫ్రెండ్స్ అందరూ బాట చెప్పులు వేసుకుని స్టైల్‌గా వస్తున్నారు నాన్నా! నాకేమో ఈ మందు సంచుల బ్యాగు, ఈ అతుకుల చెప్పులా? అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. రేపు నాకు కొత్త చెప్పులు కొనిస్తేనే నేను స్కూల్‌కి వెళ్తాను.. లేదంటే చదువు మానేసి నీలాగే పొలం పనికి వచ్చేస్తా!" అని గదిలోకి వెళ్లి తలుపు పెట్టేసుకున్నాడు.

తరువాత రోజు మురళీకృష్ణ కాళ్లకు చెప్పులు లేకుండానే బడికి వెళ్లాడు. పట్టుదలతో, మనసంతా బాధతో క్లాస్‌లో కూర్చున్నాడు.

సాయంత్రం ఇంటికి వచ్చేసరికి... నాన్న మాధవయ్య పొలం నుంచి తిరిగి వచ్చి అరుగు మీద కూర్చుని ఉన్నాడు. కొడుకు రావడం చూడగానే, పక్కనే ఉన్న ఒక క్యారీబ్యాగ్‌ని మురళీకృష్ణ చేతికి ఇచ్చాడు. ఆత్రుతగా తెరిచి చూసిన మురళీకృష్ణ... సంతోషపడకపోగా, ఆ క్యారీబ్యాగ్‌ని విసురుగా కిందకి కొట్టాడు!

"ఈ ముప్పై రూపాయల ప్లాస్టిక్ చెప్పులు నాకు వద్దు నాన్నా! మా క్లాస్‌లో అందరూ మంచి బాట చెప్పులు వేసుకుంటున్నారు..." అంటూ ఏడుస్తూ గదిలోకి వెళ్లి తలుపు పెట్టేసుకున్నాడు.

అవతలి నుంచి తల్లి విశాలాక్షి.. "ఏంట్రా ఆ అరుపులు? పెద్దోడివి అవుతున్నావు.. తండ్రి కష్టం చూడకుండా అన్ని కోరికలా?" అని గడసరిగా గద్దించింది కానీ... మాధవయ్య మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కొడుకు అన్న మాటలకి ఆ తండ్రి గుండె ఎంత గాయపడిందో ఆ రాత్రి చీకటికే తెలుసు! ఇంట్లో రూపాయి తీసి రూపాయి పెట్టలేని పరిస్థితి ఉన్నా... కొడుకు నలుగురి ముందు తలదించుకున్నాడనే నిజం ఆ తండ్రిని నిద్రపోనివ్వలేదు.

తెల్లవారింది..

కోపం తగ్గిన మురళీకృష్ణ... నాన్న రాత్రి తెచ్చిన ఆ కొత్త ప్లాస్టిక్ చెప్పులనే కాళ్లకు వేసుకుని బయటకు వచ్చాడు.

గుమ్మం పక్కన నాన్న పాత చెప్పులు కనిపించాయి. ఆ చెప్పుల పట్టీ తెగిపోతే... నాన్న దానికి ఒక పాత 'వైరు తాడుతో ముడి' వేసుకుని వాడుతున్నాడు. ఆ వైరు ముడి నాన్న పాదాలకి గుచ్చుకుంటూనే ఉంది.

అది చూసిన మురళీకృష్ణ తన అమాయకత్వంతో నాన్న వైపు చూసి—

"నేను కొత్త చెప్పులు వేసుకున్నానుగా నాన్నా... నువ్వు కూడా ఈ వైరు తాడు చెప్పులు వదిలేసి, మంచి కొత్త చెప్పులు తెచ్చుకో నాన్నా!" అంటూ బడికి పరిగెత్తాడు.

తన కష్టాలు తెలియని కొడుకు అన్న ఆ అమాయకపు మాటలకి మాధవయ్య మనసులోనే చిన్నగా నవ్వుకుంటూ... మళ్లీ ఆ వైరు ముడి చెప్పులు వేసుకునే పొలానికి బయలుదేరాడు.

ఈ పాత జ్ఞాపకాలన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చి... మురళీకృష్ణ కళ్లల్లోంచి ఒక కన్నీటి చుక్క కింద పడింది.

ఎదురుగా... తన ఇరవై నెలల కొడుకు మహి కొత్త చెప్పులు వేసుకుని 'కిచకిచ' మంటూ ఇల్లంతా తిరుగుతున్నాడు. కళ్లల్లో నీళ్లను తుడుచుకుంటూ.. "మహి గాడు..." అంటూ కొడుకుని దగ్గరకు తీసుకుని గుండెలకి హత్తుకున్నాడు మురళీకృష్ణ.

మురళీకృష్ణ మనసులోనే అనుకున్నాడు—

"నాన్నా... ఆ రోజు నా అవమానాన్ని నీ భుజాల మీద వేసుకున్నావు. ఈ రోజు నేను ప్రభుత్వ శాఖలో గెజిటెడ్ ఆఫీసర్ ర్యాంక్‌లో ఇంజనీర్‌గా ఉన్నానంటే... ఆ రోజు నువ్వు పడ్డ ఆ తపనే నాన్నా కారణం. నువ్వు చేసిన త్యాగాల ముందు.. నా ఈ ఉద్యోగం, నా హోదా ఎంత చిన్నవి నాన్నా!"

"నాన్నతో నిన్నటి జ్ఞాపకాలు..!!"

By Mahendra Jannu _Mj

Published: July 10, 2026 at 6:51 PM

© 2026 Mahendra Jannu _Mj. All rights reserved. Do not copy, distribute, or steal.
Prev

Evaluate Chapter

Your input calibrates the database for others.

Ready to play...