SCREEN ON

Directory

01

Day one

Active
Chapter // 01

Day one

unknow
Romance
1 Min Read
Pub: Aug 26, 2026

రాత్రి...

ఆకాశమంతా నిశ్శబ్దంగా ఉంది.

నగరం మొత్తం నిద్రలోకి జారుకున్నా...

ఒక చిన్న గదిలో మాత్రం ఓ యువకుడి కళ్ళు ఇంకా మేల్కొనే ఉన్నాయి.

గది అంతా చీకటే.

కిటికీ నుంచి లోపలికి వస్తున్న వెన్నెల మాత్రమే ఆ గదిలో ఉన్న వస్తువుల ఆకారాలను మెల్లగా చూపిస్తోంది.

ఆ కిటికీ దగ్గర...

ఒంటరిగా కూర్చున్నాడు శ్యామ్.

అతని కళ్ళు ఆకాశంలోని చంద్రుడిపై ఉన్నాయి.

చంద్రుడిని చూస్తున్నట్టే ఉన్నాడు...

కానీ నిజానికి అతని మనసు మాత్రం ఎక్కడో ఉంది.

ఒక అమ్మాయి దగ్గర.

రుక్మిణి.

శ్యామ్ చేతిలో ఒక తెల్లటి కాగితం ఉంది.

ఆ కాగితంపై ఎన్నో అక్షరాలు...

ఎన్నో రోజులుగా తన గుండెలో దాచుకున్న మాటలు...

ఎప్పటికీ ఆమె ముందు చెప్పలేకపోయిన ప్రేమ...

అన్నీ ఆ కాగితంలోనే ఉన్నాయి.

అతను ఆ ఉత్తరాన్ని మరోసారి చదవడానికి ప్రయత్నించాడు.

కానీ కళ్ళు అక్షరాల మీద ఉన్నా...

మనసు మాత్రం ఒక్కో జ్ఞాపకాన్ని తెరపై చూపిస్తోంది.

శ్యామ్ ఒక చిన్న అగ్గిపుల్ల వెలిగించాడు.

ఆ మంటను కొద్దిసేపు చూస్తూ...

తన పెదవులపై ఒక చిన్న నవ్వు వచ్చింది.

ఆ నవ్వులో ఆనందం లేదు.

ఓటమి ఉంది.

ఆ అగ్గిపుల్లను ఉత్తరం చివరికి తాకించాడు.

మంట నెమ్మదిగా కాగితాన్ని తినడం ప్రారంభించింది.

మొదట ఒక మూల...

తర్వాత ఇంకొక మూల...

ఆ మంట మెల్లగా పైకి పాకుతూ...

ఒక పేరును చేరుకుంది.

"రుక్మిణి..."

ఆ పేరు కూడా కాలిపోవడానికి సిద్ధమైంది.

అదే క్షణంలో...

శ్యామ్ కళ్ళు ఒక్కసారిగా ఆ అక్షరాల మీద నిలిచిపోయాయి.

అతని మెదడు...

ఆ ఉత్తరంలోని ప్రతి అక్షరాన్ని మళ్లీ చదవడం ప్రారంభించింది.

...........

10-11-2025

"Dear Rukmini..."

నాకు ఈ లెటర్ ఎలా మొదలుపెట్టాలో కూడా తెలియడం లేదు.

ఎందుకంటే...

నా జీవితంలో మొదటిసారి నేను నా మనసులో ఉన్నదంతా ఒక మనిషికి చెప్పబోతున్నాను.

అది కూడా...

నిన్ను.

నేను అందంగా లేను.

నీకు సరిపోయేంత అందం నాకు లేదు.

నాకు పెద్దగా డబ్బు లేదు.

నీతో పోలిస్తే నేను ఏ విషయంలోనూ గొప్పవాడిని కాదు.

నిజం చెప్పాలంటే...

నేను చాలా awkward.

కొంచెం weird కూడా.

ఎవరితోనైనా సరిగ్గా మాట్లాడటానికి కూడా కొన్ని సార్లు నాకు చాలా సమయం పడుతుంది.

కానీ...

ఎలా జరిగిందో నాకు తెలియదు.

ఎప్పుడు జరిగిందో కూడా తెలియదు.

కానీ ఏదో ఒక రోజు...

నా గుండె నిన్ను ఇష్టపడటం మొదలుపెట్టింది.

నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత...

నా నవ్వుకి కూడా ఒక కారణం వచ్చింది.

నా friends నీ పేరు చెప్పి నన్ను ఆటపట్టిస్తే...

నేను కోపంగా నటించినా...

నా బుగ్గలు మాత్రం నా రహస్యాన్ని వాళ్లకి చెప్పేస్తాయి.

నువ్వు నన్ను చూసిన ప్రతిసారి...

నా గుండె ఒక క్షణం ఆగిపోయినట్టు అనిపిస్తుంది.

ఆ తర్వాత...

నేను ఇంటికి వెళ్లి మంచం మీద పడుకుని...

ఆ రోజు మన మధ్య జరిగిన ఆ చిన్న eye contact ని మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటాను.

నిజానికి...

నీతో నాకు పెద్దగా మాట్లాడాలని కూడా ఏమీ లేదు.

ఒక్కసారి...

సింపుల్‌గా...

"ఎలా ఉన్నావు?" అని అడగాలని ఉంది.

నీతో కొంతసేపు కూర్చుని మాట్లాడాలని ఉంది.

నీతో కలిసి నవ్వాలని ఉంది.

నీ చిన్న చిన్న విషయాలను గుర్తుపెట్టుకోవాలని ఉంది.

నిన్ను జీవితాంతం...

నా భార్యలా చూసుకోవాలని ఉంది.

అంతే.

నా కోరిక చాలా చిన్నది.

కానీ...

నా గుండెకి మాత్రం అది మొత్తం ప్రపంచం.

నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత జీవితం ఎలా ఉంటుందో...

ఎన్నోసార్లు ఊహించుకున్నాను.

నీతో కలిసి ఒక ఇంట్లో ఉండటం...

ఉదయాన్నే నిన్ను చూడటం...

నువ్వు కోపంగా ఉన్నప్పుడు నిన్ను నవ్వించడం...

నేను పని నుంచి ఇంటికి వస్తే నువ్వు ఎదురుగా ఉండటం...

ఇవన్నీ ఆలోచిస్తే...

నా జీవితమే స్వర్గంలా

అనిపిస్తుంది.

కానీ...

నువ్వు లేని స్వర్గం నాకు వద్దు.

ఎందుకంటే...

నా స్వర్గం ఎక్కడుందో నాకు తెలుసు.

అది...నువ్వే.

నిన్ను నేను దూరం నుంచి చూస్తూ ప్రేమించాను.

దేవత కనిపించకపోయినా...

ఆమెను నమ్మి ప్రార్థించే భక్తుడిలా...

నువ్వు నా ముందు లేకపోయినా...

నా మనసులో మాత్రం ప్రతిరోజూ నిన్నే చూసుకున్నాను.

కానీ ఇక...

నా ప్రేమను దాచిపెట్టాలని అనిపించడం లేదు.

ఇప్పుడు...

నిన్ను అడిగేంత ధైర్యం వచ్చింది.

నువ్వు రేపు ఎలా కనిపించినా...

నీ అందం మారిపోయినా...

నీ జుట్టు తెల్లబడినా...

నీ వయసు పెరిగినా...

నువ్వు లావుగా అయినా...

నీ ముఖంలో ఈరోజున్న అందం రేపు లేకపోయినా...

నా ప్రేమ మాత్రం మారదు.

ఎందుకంటే...

నేను ప్రేమించింది నీ అందాన్ని మాత్రమే కాదు.

నిన్ను.

కాలం మారుతుంది.

అందం పోతుంది.

మనుషులు మారతారు.

కానీ...

చివరికి మిగిలేది...

మనిద్దరం.

ఒక సాయంత్రం...

మనిద్దరం ఒక సరస్సు ఒడ్డున కూర్చుని...

ఏమీ మాట్లాడకుండా...

ఆకాశాన్ని చూస్తూ...

ఒకే గాలిని పీలుస్తూ...

పక్కపక్కనే కూర్చుని ఉండటం...

నా జీవితానికి చివర్లో నాకు కావాల్సింది అంతే.

Dear Rukmini...

Will you be mine?

నీ శ్యామ్.

ఉత్తరంలోని చివరి అక్షరం కూడా మంటల్లో కలిసిపోయింది.

శ్యామ్ కళ్ళల్లో నీళ్లు చేరాయి.

కానీ అతను ఏడవలేదు.

ఆ ఉత్తరం పూర్తిగా బూడిదయ్యే వరకు చూస్తూనే ఉన్నాడు.

చివరికి...

ఆ బూడిదను చేతిలోకి తీసుకుని..

కిటికీ బయటకు వదిలేశాడు.

గాలి ఆ బూడిదను తీసుకెళ్లిపోయింది.

శ్యామ్ మాత్రం కదల్లేదు.

అతని కళ్ళు మళ్లీ చంద్రుడిపైకి వెళ్లాయి.

"ఇంత ప్రేమ ఉన్నా...

రుక్మిణికి ఎందుకు చెప్పలేకపోయాను?"

అతని మనసులో ఆ ప్రశ్న మళ్లీ మళ్లీ వినిపించింది.

కానీ...

ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే...

మన కథను కొన్ని నెలలు వెనక్కి తీసుకెళ్లాలి.

కొన్ని నెలల క్రితం...

ఒక సాధారణమైన ఉదయం.

కాలేజీ ప్రాంగణం మొత్తం విద్యార్థులతో నిండిపోయింది..

ఎవరో క్లాసులకు పరుగులు తీస్తున్నారు.

ఎవరో క్యాంటీన్ దగ్గర టీ తాగుతున్నారు.

మరికొందరు బైక్‌లపై వచ్చి ఫ్రెండ్స్‌తో మాట్లాడుతున్నారు.

ఆ గుంపులో...

ఎవరి దృష్టినీ ఆకర్షించని ఒక అబ్బాయి నడుస్తున్నాడు.

అతనే...

శ్యామ్.

సింపుల్ షర్ట్.

సింపుల్ బ్యాగ్.

చేతిలో కొన్ని పుస్తకాలు.

ముఖంలో ఎప్పటిలాగే ఆ చిన్న సంకోచం.

ఎవరినైనా చూసి మాట్లాడాలంటే...

ముందుగా తనలో తానే పదిసార్లు ప్రాక్టీస్ చేసుకునే రకం.

అతని స్నేహితులు మాత్రం అతన్ని ఎప్పుడూ ఆటపట్టిస్తూ ఉండేవారు.

"రేయ్ శ్యామ్...

నువ్వు జీవితంలో ఎవరినైనా ప్రేమిస్తావా అసలు?"

శ్యామ్ నవ్వి...

"నాకు ఆ టైమ్ లేదు రా."

అని తప్పించుకునేవాడు

కానీ...

అతనికి తెలియదు.

అతని జీవితంలో ప్రేమ ఇప్పటికే అడుగుపెట్టబోతోందని.

ఆ రోజు...

అతను కాలేజీ మెట్ల దగ్గరికి వచ్చాడు.

అప్పుడే...

ఎదురుగా ఒక అమ్మాయి నడుచుకుంటూ వచ్చింది.

తెల్లటి దుస్తులు...

భుజాల మీదుగా జారుతున్న పొడవాటి జుట్టు...

చేతిలో కొన్ని పుస్తకాలు...

ముఖంలో ఎలాంటి హడావుడి లేని ప్రశాంతత.

ఆమె పేరు...

రుక్మిణి.

శ్యామ్ మొదట ఆమెను చూసింది...

కేవలం కొన్ని సెకన్లే.

కానీ...

ఆ కొన్ని సెకన్లు అతని జీవితంలోనే ఎక్కువసేపు నిలిచిపోయాయి.

రుక్మిణి తన దారిలో తాను వెళ్తోంది.

శ్యామ్ మాత్రం...

ఆమె వెళ్లిపోయిన తర్వాత కూడా అక్కడే నిలబడ్డాడు.

అతని స్నేహితుడు వెనుక నుంచి వచ్చి భుజం మీద కొట్టాడు.

"ఏంట్రా?"

శ్యామ్ ఉలిక్కిపడి...

"ఏం లేదు."

"ఏం లేదంటే?"

"ఏం లేదురా."

అని చెప్పి ముందుకు నడిచాడు.

కానీ...

అతని ముఖంలో కనిపించిన ఆ చిన్న నవ్వు మాత్రం...

అతని స్నేహితుడికి ఏదో అర్థమయ్యేలా చేసింది.

ఆ రోజు రాత్రి...

శ్యామ్ తన గదిలో మంచం మీద పడుకున్నాడు.

కళ్ళు మూసుకున్నాడు.

అతని మెదడులో మళ్లీ అదే దృశ్యం.

మెట్ల దగ్గర...

రుక్మిణి.

ఆమె నడక.

ఆమె ముఖం.

ఆ క్షణం.

అతను తనలో తానే నవ్వుకున్నాడు.

"అరే...

ఇది ఏంటి?"

అని అనుకున్నాడు.

అతనికి అప్పటివరకు తెలియదు...

అది ప్రేమకు మొదటి అడుగు అని.

ఆ రోజు కేవలం ఒక చూపు.

ఆ తర్వాత...

ప్రతిరోజూ ఆమెను చూడాలనిఎదురుచూపు.

ఒక రోజు ఆమె చిరునవ్వు.

మరో రోజు చిన్న eye contact.

ఇంకో రోజు...

ఆమె తన పక్కనుంచి వెళ్లిపోవడం.

అంతే.

శ్యామ్ ప్రపంచం మెల్లగా మారిపోయింది.

కానీ రుక్మిణికి...

అతని మనసులో జరుగుతున్న ఈ యుద్ధం గురించి అసలు తెలియదు.

ఎందుకంటే...

శ్యామ్ ప్రేమించడం నేర్చుకున్నాడు.

కానీ...

ప్రేమను చెప్పడం మాత్రం నేర్చుకోలేదు.

మరి...

ఒక రోజు అతను నిజంగా రుక్మిణి ముందు నిలబడి తన ప్రేమను చెప్పాడా?

లేక...

ఆ ఉత్తరం లాగే...

తన ప్రేమ కూడా మంటల్లోనే మిగిలిపోయిందా?

My Dear Rukmini

By unknow

Published: August 26, 2026 at 3:20 PM

© 2026 unknow. All rights reserved. Do not copy, distribute, or steal.

Evaluate Chapter

Your input calibrates the database for others.

Ready to play...