ముఖ్యమంత్రి మైక్ దగ్గరకి వెళ్లి:- “ఇప్పుడు శ్యామ్ గారు కొన్ని మాటలు మాట్లాడాలి అని కోరుకుంటున్నాను. శ్యామ్ గారు మీరు రచించిన పుస్తకం లో మిమ్మల్ని బాగా కదిపిన ఒక సంఘటన గురించి మాట్లాడండి. ఆ పుస్తకం నేను నిన్ననే చదివాను” అని అన్నారు.
మళ్ళీ చప్పట్లు.
శ్యామ్ నెమ్మదిగా మైక్ దగ్గరకి వెళ్లాడు. అతని చేతులు కొంచెం వణుకుతున్నాయి. జీవితంలో మొదటిసారి… ఇంత పెద్ద సభ ముందు నిలబడ్డాడు.
మైక్ పట్టుకున్నాడు. కానీ మాట రావడం లేదు.
కొన్ని క్షణాలు నిశ్శబ్దం.
అక్కడున్న జనాలు కూడా మౌనంగా అతని వైపు చూస్తున్నారు.
శ్యామ్ మెల్లగా తలెత్తి ఆ సభ మొత్తం చూసాడు. అక్కడ… తన కోసం వేలాది మంది వచ్చారు.
ఒకప్పుడు ఒంటరిగా తిరిగిన అతను… ఈరోజు ప్రజల మనసుల్లో నిలిచిపోయాడు.
అప్పుడే… దూరం నుండి రుక్మిణీ చిన్నగా చేయి ఊపింది.
ఆమె కళ్ళల్లో ధైర్యం ఉంది.
ఆమె పక్కనే… హరిచంద్ర గారు నిలబడి ఉన్నారు.
ఆయన కూడా ఈసారి శ్యామ్ వైపు చూసి చిన్నగా చిరునవ్వు నవ్వాడు.
ఆ నవ్వు చూసిన క్షణంలో… శ్యామ్ గుండెల్లో ఏదో బలం వచ్చింది.
అతని భయం ఒక్కసారిగా తగ్గిపోయింది.
మైక్ ని గట్టిగా పట్టుకున్నాడు.
అవార్డు గెలిచిన గర్వం మాత్రం అతని కళ్ళల్లో లేదు. బదులుగా… ఒక బాధ ఉంది.
శ్యామ్ నెమ్మదిగా మాట్లాడడం మొదలుపెట్టాడు.
“ఈరోజు… నేను గెలిచాను అని అందరూ అంటున్నారు…”
సభ మొత్తం నిశ్శబ్దం.
“కానీ నిజానికి… ఈ సమాజం ఓడిపోయింది.”
అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా ఆశ్చర్యంగా చూశారు.
శ్యామ్ కళ్ళు నెమ్మదిగా ఎర్రబడుతున్నాయి.
“ఎందుకంటే… ఒక మనిషి గెలిస్తేనే ఈ సమాజం అతని మాట వింటుంది.”
అతని గొంతు భారంగా మారింది.
“నేను ఈరోజు ఒక విషయం గురించి మాట్లాడాలి… చిన్నపిల్లల మీద జరిగే దారుణాల గురించి.”
సభ మొత్తం ఒక్కసారిగా గంభీరంగా మారిపోయింది.
“కొన్ని నెలల క్రితం… ఒక ఊరికి వెళ్లినప్పుడు… ఒక చిన్న పాప… నాతో ఒక విషయం చెప్పింది…”
“కానీ… ఆ చిన్నారి మాత్రం… ఆ సంఘటనని జీవితాంతం మర్చిపోలేదు!”
ఇప్పుడు అతని మాటల్లో అగ్ని ఉంది.
“మీ ఇంట్లో కూడా మీకు ఒక నాన్న ఉంటాడు… ఒక అన్న ఉంటాడు… ఒక మామ ఉంటాడు… అని నమ్మి మౌనంగా ఉండొద్దు అమ్మ!”
అతను ఒక్కసారిగా గట్టిగా అరిచాడు:-
“ఎదురు తిరగండి! పోరాడండి! చేయి వేస్తే… చంపేయండి!”
శ్యామ్ తన పుస్తకం లో రాసిన మాటలే ఇవి అని అన్నాడు.
“ఎందుకంటే… ప్రతి ఆడపిల్ల తన జీవితంలో ఒక చేదు అనుభూతిని ఎదుర్కొంటుంది. వాళ్ళ సొంత కుటుంబ సభ్యులే వాళ్ళతో తప్పుగా ప్రవర్తిస్తారు. కానీ వాళ్ళకి ఏం చెప్పాలో? ఎవరికి చెప్పాలో? అసలు అలాంటి విషయాలు చెప్పొచ్చో లేదో? అని వాళ్ళలో వాళ్ళే నలిగిపోతారు.
అదే ధైర్యం చేసుకుని వాళ్ళ అమ్మగారికి చెప్తే… ‘మన కుటుంబ సభ్యులు అమ్మ… మనమే తగ్గాలి… మళ్ళీ గొడవలు అవుతాయి’ అని భయపడతారు.
అదే నాన్నకి చెప్తే… ‘పరువు ముఖ్యం’ అని తిరిగి కూతురినే తప్పుపడతారు.
ఇంకా వాళ్ళు ఎవరికి చెప్తారు?
మనమే వాళ్ళ నోరు నొక్కేస్తున్నాం!
ఇకనైనా మేలుకోండి! ఎదిరించండి! పోరాడండి!
తప్పు చేసినోడిని చంపేయండి!!
అంతే గానీ వాళ్ళ జీవితంలో మర్చిపోలేని ఒక చేదు గుర్తుని మిగల్చకండి!
భయపడాలి… మన ఇంటి ఆడపిల్ల జోలికి రావాలి అంటే!”
అని ఆ అంశం పై అరగంట మాట్లాడాడు.
ఆ సభ మొత్తం దద్దరిల్లిపోయింది.
ముఖ్యమంత్రి కూడా ఆశ్చర్యపోయాడు.
ఒక రచయిత… ఒక అవార్డు వేదికని… విప్లవ సభగా మార్చేశాడు.
శ్యామ్ శ్వాస బరువుగా మారింది.
అతని కళ్ళ ముందు ఆ చిన్న పాప గుర్తొచ్చింది.
(గతం…)
ఆ రోజు… ఆ పాప ఏడుస్తూ తన బాధ చెప్పిన తర్వాత…
శ్యామ్ కోపంతో ఊగిపోయాడు.
ఆ పాప మేనమామని… ఆవు మెడ గంటలతో చితకబాదాడు.
అప్పుడు కూడా అతని కళ్ళల్లో ఇదే అగ్ని ఉంది.
(ప్రస్తుతం…)
శ్యామ్ ఒక్కసారిగా తన పక్కన ఉన్న పుస్తకాన్ని తీసుకున్నాడు.
అది… నిన్ననే ప్రచురితమైన అతని పుస్తకం.
ఆ పుస్తకం కవర్ పై చేతిని నెమ్మదిగా వేసి…
అందరి ముందు దానికి ముద్దు పెట్టుకున్నాడు.
సభ మొత్తం ఒక్కసారిగా నిలబడి చప్పట్లు కొట్టింది.
రుక్మిణీ కళ్ళల్లో కన్నీళ్లు జారిపోయాయి.
కానీ… ఆ కన్నీళ్లలో బాధ లేదు.
గర్వం మాత్రమే ఉంది.
“నేను ప్రేమించింది… ఒక మనిషిని కాదు… ఒక విప్లవాన్ని…”
ముఖ్యమంత్రి గారు మైక్ తీసుకుని శ్యామ్ గురించి ఎంతో గొప్పగా చెప్పారు.
“ఇలాంటి యువ రచయిత మన తెలుగు రాష్ట్రంలో పుట్టడం మన అందరి అదృష్టం! ఈ పుస్తకాన్ని ఒక్క తెలుగు లోనే కాదు, అనేక భాషల్లో అనువదించి ప్రచురింపజేయించే ప్రయత్నం నేను చేస్తాను! శ్యామ్ గారు… మీరు మాత్రం ఇలాంటి పుస్తకాలు ఇంకా ఎన్నో రాయాలి అని కోరుకుంటున్నాను!” అని శ్యామ్ కి నమస్కరించారు.
అందరూ ఆగకుండా కొన్ని నిమిషాల పాటు చప్పట్లు కొడుతూనే ఉన్నారు.
శ్యామ్ రుక్మిణీ కోసం వెతికాడు.
తన చేతిలో ఉన్న అవార్డుని పక్కన ఉన్న ప్రేమ్ కి ఇచ్చి…
శ్యామ్ పరుగులు తీసుకుంటూ వెళ్లి…
అందరి ముందే రుక్మిణీని కౌగిలించుకున్నాడు గట్టిగా .
వెనుకనుండి హరిచంద్ర గారు, సుమతీ… శ్యామ్, రుక్మిణీలను చూసి మురిసిపోయారు.
“అంత బాగా చూసుకునే వాడు అల్లుడిగా వస్తే ఎవరు మాత్రం కాదంటారు?” అనే ఆనందం వాళ్ళ కళ్ళల్లో కనిపించింది.
అదే ఆనందంతో వరహాలు, శుభలక్ష్మి కూడా అక్కడకి వచ్చారు.
రుక్మిణీ… శ్యామ్ గెడ్డం మీద ముద్దు పెట్టుకుంది!
అక్కడే ఉన్న జనం అంతా వాళ్ళనే చూస్తున్నారు.
ఎందరో నాయకులు కూడా ఉన్నారు.
కానీ వాళ్ళిద్దరూ మాత్రం వాళ్ళ లోకంలో ఉన్నారు.
శ్యామ్ వాళ్ళ మేనత్త శ్యామ్ చేతులు పట్టుకుని:- “నన్ను క్షమించు బాబు! మీ నాన్న మీద కోపంతో నిన్ను దూరం పెట్టాను…” అని అంది.
అప్పుడే మరోపక్క నుండి శ్యామ్ పూర్తి కుటుంబం వచ్చేసింది.
“శ్యామ్ బాబు! నేను మీ బాబాయిని…” “నేను మీ పెద్దమ్మని…” “నేను మీ అక్కని…” “నేను మీ తమ్ముడిని…”
అని అందరూ ఒక్కసారిగా మాట్లాడడం మొదలుపెట్టారు.
కానీ నిజానికి… మన శ్యామ్ 12 సంవత్సరాల తర్వాత అతని జీవితంలో మొదటిసారి వాళ్ళందరినీ చూస్తున్నాడు.
శ్యామ్ కి వాళ్ళతో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు.
చేసేది ఏం లేక… అందరినీ నవ్వుతూ ఆప్యాయంగా పలకరించాడు.
ఆ తర్వాత ప్రేమ్ ని తీసుకుని రుక్మిణీ వాళ్ళతో అక్కడ నుండి వెళ్లిపోయాడు.
వరహాలు కి అంతా అర్థమైంది.
అక్కడకి వచ్చిన మిగతా చుట్టాలు మాత్రం:-
“గొప్పవాడు అయ్యాడు కదా… తలపొగరు ఎక్కింది. అందుకే మనల్ని గుర్తుపట్టనట్టు వెళ్లిపోయాడు…” అని అనడం మొదలుపెట్టారు.
అప్పుడు శుభలక్ష్మి కి కోపం వచ్చి:-
“మీలో ఎవరికి ధైర్యం ఉంటే అదే మాట గట్టిగా, జనం అందరూ వింటుండగా అనండి చూద్దాం! ఎంత మంది మీ ఇళ్లకు వెళ్తారో చూస్తా!” అని అంది.
అప్పుడు శ్యామ్ వాళ్ళ పెద్దన్న:- “ఏంటి నోరు లేస్తుంది!?” అని అన్నాడు.
అప్పుడు వరహాలు గట్టిగా:-
“అవును! గత పన్నెండు సంవత్సరాలుగా మీలో ఏ ఒక్కడు కూడా బడి కి మొహం చూపించలేదు! పైగా వాడే మిమ్మల్ని గుర్తుపడతాడు అని ఊహిస్తున్నారు! సిగ్గు లేకపోతే సరి!
ఇకనైనా మారండి!
వాడు కావాలి అని అనుకుంటే మన గురించి మొత్తం అందరి ముందు చెప్పి పరువు తీయొచ్చు. కానీ వాడు సమాజం కోసం మాత్రమే మాట్లాడాడు.
అదే వాడు వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడి ఉంటే… మన మీద జనం తూ అని ఉమ్మి వేసేవారు!” అని అక్కడ నుండి వెళ్లిపోయాడు.
మిగతా కుటుంబ సభ్యులు సిగ్గుతో తల దించుకున్నారు.
….
ఇంతకీ… రుక్మిణీ శ్యామ్ కి ఆ పుస్తకాన్ని ఇచ్చిందా లేదా?