శ్యామ్‌కి అవార్డు ఇచ్చే రోజు…
రాష్ట్ర ప్రభుత్వం పంపిన కారులో శ్యామ్, విశ్వనాథ్ గారు, ప్రేమ్ కలిసి బయల్దేరారు.
నరసింహం గారు మాత్రం :-
“నేను మీ అత్తయ్యని తీసుకుని నేరుగా అవార్డు ఫంక్షన్ హాల్‌కి వస్తా!” అని అన్నారు.
మండోదరి గారికి శ్యామ్ అంటే చాలా ఇష్టం.
ఆమె గనక “శ్యామ్‌ని విశ్వనాథ్ గారి దగ్గరికి పంపిద్దాం” అని అనకపోయి ఉంటే… ఈ రోజు శ్యామ్ ఈ స్థాయిలో ఉండేవాడు కాదు.
అన్నట్టు… మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను.
నిన్న… అనగా 25వ తేదీన… శ్యామ్ రచించిన మొదటి పుస్తకం విడుదలైంది.
అందరూ ఆ పుస్తకం చదవడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు.
దానికి తోడు ఇప్పుడు రాష్ట్రం మొత్తానికి తెలుసు శ్యామ్ ఎవరో.
దాంతో ఆ పుస్తకం అమ్మకాలు మరింత చురుకుగా సాగుతున్నాయి.
శ్యామ్ అవార్డు తీసుకుంటుంటే చూడాలి అని వరహాలు తన కుటుంబంతో సహా వచ్చాడు.
అందరి కన్నా ముందే అక్కడికి వచ్చేశాడు ఆయన.
అక్కడ శ్యామ్‌ది ఒక పెద్ద పోస్టర్ వేశారు… ముఖ్యమంత్రి గారి పోస్టర్ పక్కనే.
అది చూసిన శుభలక్ష్మి గారు ఆ హాల్ ఎంత పెద్దగా ఉందో అని ఆశ్చర్యపోయింది.
మీనాక్షి అయితే ఎంతో ఆసక్తిగా శ్యామ్ కోసం ఎదురు చూస్తోంది.
అప్పటికే గొప్ప గొప్ప వ్యక్తులు అందరూ అక్కడికి వస్తున్నారు.
మీనాక్షి :-
“నాన్న… బావ ఇంకా రాలేదు ఏంటి?” అని అడిగింది.
అప్పుడు వరహాలు :-
“వస్తాడు… సొంత అవార్డు ఫంక్షన్‌కి అంత తొందరగా వస్తే ఏమనుకుంటారో అని ఏమో…” అని అమాయకంగా అన్నాడు.
ఆ మాటకి అక్కడ ఉన్న వాళ్ళు చిన్నగా నవ్వుకున్నారు.
శుభలక్ష్మి గారికి మాత్రం…
ఆవిడ చేసిన తప్పులు గుర్తొచ్చాయి.
కాసేపు ఆమె ముఖంలో చిరునవ్వు మాయమైంది.
కానీ… “మార్పు చెందడమే మనిషి గొప్పతనం” అని అర్థం చేసుకుని మళ్ళీ చిన్నగా నవ్వుకుంది.
---
మరోవైపు…
రుక్మిణీ వాళ్ళ ఇంట్లో…
హరిచంద్ర గారు రుక్మిణీ వైపు చూస్తూ :-
“నాకు తెలుసు రుక్మిణీ… ఇన్ని రోజులు నువ్వు ఎక్కడ ఉన్నావో…” అని అన్నారు.
అని… విడుదలైన శ్యామ్ పుస్తకాన్ని రుక్మిణీ చేతిలో పెట్టారు.
రుక్మిణీ వెంటనే ఆ పుస్తకం తీసుకుని చూడాలి అనుకుంది.
కానీ… వాళ్ళ నాన్న ఉద్దేశం అర్థం కాక ఆ పుస్తకాన్ని పట్టుకోలేదు.
అప్పుడే…
సుమతి గారు వెనుక పెట్టుకున్న చేతులను ముందుకు తీసుకొచ్చారు.
మువ్వల శబ్దం వినిపించింది.
రుక్మిణీ ఆశ్చర్యంగా వాళ్ళ అమ్మ వైపు చూసింది.
సుమతి నవ్వుతూ ఇలా అంది:-
“నిన్న రాత్రి… నీ నాన్న గారు, నేను… ఆ అబ్బాయి రాసిన పుస్తకం చదివాం.
అందులో… నా చిన్నప్పుడు నేను పడిన కష్టాలు అన్నీ ఉన్నాయి.
పైగా… నాకు చిన్నప్పుడు నీలాగే కూచిపూడి నేర్చుకోవాలి అని ఉండేది.
కానీ మా అమ్మ నన్ను ఇంటి బయటికి కూడా వెళ్ళనిచ్చేది కాదు.
వయసులో చిన్నపిల్లని కదా…
‘ఆడపిల్ల అంటే గడప దాటకూడదు’ అని చెప్పి ఇన్ని రోజులు అజ్ఞానంలో బ్రతికేశాను.
నీకు నాట్యం అంటే ఇష్టం కదా అమ్మ…
తీసుకో…”
అని ఆమె పశ్చాత్తాపంతో చెప్పిన మాటలు విన్న రుక్మిణీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.
అప్పుడే హరిచంద్ర గారు రుక్మిణీ దగ్గరకి వచ్చి ఆమె తల నిమిరుతూ ఇలా అన్నారు:-
“మనిషి గొప్పతనం కులంలోనో… డబ్బులోనో ఉండదని ఇప్పుడు అర్థమైంది అమ్మ…
నువ్వు ఆరోజు శ్యామ్ దగ్గరకి వెళ్తున్నావని నాకు ముందే తెలుసు.
నువ్వు శ్యామ్ కోసం రాసిన ఆ ప్రేమ పుస్తకం కూడా చదివాను.
మొదట చాలా కోపం వచ్చింది.
తుపాకీ తీసుకుని బయల్దేరాను కూడా…
అప్పుడే మన డ్రైవర్ శ్యామ్‌ని అరెస్టు చేసిన వార్త చెప్పాడు.
వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయానికి లేఖ రాయించి పంపాను.
నీ ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో…
ఆ రోజు అర్థమైంది.
కానీ… తండ్రిగా కాస్త కఠినంగా ఉన్నాను అంతే…”
అని అన్నాడు.
ఆ మాటలు విన్న రుక్మిణీ ఒక్కసారిగా వాళ్ళ అమ్మని హత్తుకుని ఏడ్చేసింది.
రుక్మిణీ :-
“నన్ను క్షమించండి అమ్మ…
మీ దగ్గర ఈ విషయం దాచినందుకు…
మీకు చెప్తే ఎలా అర్థం చేసుకుంటారో అని భయపడ్డాను.
కానీ… మీ దగ్గర ఈ విషయం దాచిపెట్టాలి అని కాదు…”
అని ఏడుస్తూ అంది.
అప్పుడే డ్రైవర్ లోపలికి వచ్చి :-
“అయ్యా… ఇప్పటికే ఆలస్యం అయింది. త్వరగా రండి. అక్కడ కార్యక్రమం మొదలుపెడతారు!” అని అన్నాడు.
అప్పుడు హరిచంద్ర గారు నవ్వుతూ :-
“పద సుమతి… మన అల్లుడికి అవార్డు ఇస్తుంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం!” అని అన్నారు.
ఆ మాట విన్న రుక్మిణీకి పట్టరాని సంతోషం వచ్చింది.
లోపలికి గబగబా పరుగెత్తి…
గోవిందుడి దగ్గర పెట్టిన ఒక డైరీ తీసుకుని… మళ్ళీ పరుగున బయటికి వచ్చింది.
రుక్మిణీ :-
“పదండి నాన్న… వెళ్దాం!” అని ఉత్సాహంగా అంది.
వాళ్ళంతా బయల్దేరారు.
కారులో కూర్చున్న రుక్మిణీకి మాత్రం…
“ఎంత త్వరగా శ్యామ్‌ని చూస్తానా…” అనే ఆలోచనే ఉంది.
తన చేతిలో ఉన్న డైరీని చూసుకుని మురిసిపోతోంది.
బహుశా… అదే తాను రాస్తానని చెప్పిన పుస్తకం కావచ్చు.
సరైన సమయం కోసం… ఆ పుస్తకం శ్యామ్ దగ్గరికి వెళ్లడానికి ఇన్ని రోజులు ఎదురు చూస్తూ ఉండి ఉండొచ్చు.
ఆ ప్రయాణం రుక్మిణీకి…
ఒక్కో క్షణం ఒక్కో యుగంలా గడిచింది.
---
శ్యామ్ అక్కడికి రానే వచ్చాడు.
పెద్ద పెద్ద బ్యానర్లు…
“ధర్మ వీర పురస్కారం గ్రహీత – యువ రచయిత శ్యామ్”
అని నగరం మొత్తం కనిపిస్తున్నాయి.
సభా ప్రాంగణం బయట వేలాది మంది జనం గుమిగూడారు.
విద్యార్థులు… రచయితలు… సామాజిక కార్యకర్తలు… పత్రికా ప్రతినిధులు… రాజకీయ నాయకులు…
అందరూ ఒకే వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నారు.
“అతడేనా ఆ శ్యామ్?”
“అవును… అదే కుర్రాడు…”
“ఒక్కడే ఒక ఊరి పరిస్థితి మార్చేశాడట…”
“అతని పుస్తకం కూడా సంచలనం అయిందట…”
అలా జనాల్లో మాటలు వినిపిస్తున్నాయి.
వేదిక మొత్తం అద్భుతంగా అలంకరించారు.
పెద్ద ఎర్రటి తెరలు…
మధ్యలో రాష్ట్ర చిహ్నం…
పక్కనే బంగారు అక్షరాలతో
“ధర్మ వీర పురస్కార ప్రదానోత్సవం”.
ముఖ్యమంత్రి, మంత్రులు, పెద్ద పెద్ద అధికారులు, రచయితలు…
అందరూ వేదిక మీద కూర్చున్నారు.
అప్పుడే…
మరో కారు అక్కడికి వచ్చింది.
ఆ కార్ తలుపు నెమ్మదిగా తెరుచుకుంది.
దానిలో నుండి దిగింది మన రుక్మిణీ.
ఆకుపచ్చ రంగు బంగారు అంచులున్న చీర…
నల్లని ఉంగరాల జుట్టు…
రౌండ్ కళ్ళద్దాలు…
నుదుటిపై చిన్న కుంకుమ బొట్టు…
ఆమె కళ్ళల్లో మాత్రం ఒక్క భావమే ఉంది.
“శ్యామ్…”
ఆ సభ మొత్తం ఆమెకి కనిపించడం లేదు.
వేదిక మీద నిలబడి ఉన్న అతడే కనిపిస్తున్నాడు.
ఆమె లోపలికి అడుగు పెట్టగానే…
అప్పటికే శ్యామ్ పేరు ప్రకటించారు.
“ఈ సంవత్సరానికి ‘ధర్మ వీర’ పురస్కారాన్ని యువ రచయిత, సామాజిక కార్యకర్త శ్రీ శ్యామ్ గారికి అందజేస్తున్నాము!”
ఒక్కసారిగా సభ మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది.
వరహాలు లేచి నిలబడి గట్టిగా చప్పట్లు కొట్టాడు.
మీనాక్షి కళ్ళల్లో ఆనందం.
కామాక్షి గర్వంగా నవ్వుతోంది.
శుభలక్ష్మి కూడా చప్పట్లు కొడుతోంది.
అదంతా చూసిన రుక్మిణీ గుండె ఒక్కసారిగా నిండిపోయింది.
“నేను ప్రేమించిన వ్యక్తి… ఇంత గొప్పవాడా…”
అని ఆమె మనసు గర్వంతో కంపించింది.
శ్యామ్ వేదిక మీదకి నడుస్తున్నాడు.
తెల్లటి కుర్తా…
సాధారణ చెప్పులు…
ముఖంలో ఎలాంటి అహంకారం లేదు.
అతను ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లగానే…
ముఖ్యమంత్రి స్వయంగా లేచి అతని చేతిని పట్టుకున్నాడు.
“నీలాంటి యువకులు సమాజానికి అవసరం శ్యామ్!” అని అన్నాడు.
అక్కడ ఉన్న నాయకులు, అధికారులు అందరూ అతనికి అభినందనలు చెబుతున్నారు.
ఫోటోలు…
ఫ్లాష్ లైట్లు…
చప్పట్లు…
అది మొత్తం చూసిన రుక్మిణీ ఒక్కసారిగా తన అమ్మ చేయి పట్టుకుని చిన్నపిల్లలా గెంతేసింది.
“అమ్మా! చూశావా! శ్యామ్ గారు…!”
ఆమెకి ఆ క్షణంలో అక్కడ ఎవరు ఉన్నారో కూడా గుర్తు లేదు.
పరువు…
భయం…
సిగ్గు…
ఏమీ లేవు.
తాను ప్రేమించిన మనిషి ప్రపంచం ముందు నిలబడి గౌరవం అందుకుంటున్నాడు అన్న ఆనందం మాత్రమే ఉంది.