శ్యామ్ కొద్దిసేపు మౌనంగా కూర్చున్నాడు.
అతని ముఖంలో గౌరవం ఉంది. కానీ… ప్రేమ లేదు.
అతను నెమ్మదిగా వరహాలు వైపు చూసి :-
“మామయ్య… మీరు నన్ను అంగీకరించడం నాకు చాలా పెద్ద విషయం. మీరు ఇలా రావడం… క్షమాపణ చెప్పడం… ఇది నేను జీవితంలో మర్చిపోలేను.”
అని అన్నాడు.
వరహాలు ఆశగా అతని వైపు చూశాడు.
శ్యామ్ నెమ్మదిగా చిరునవ్వు నవ్వాడు.
“కానీ… మీనాక్షి నన్ను గౌరవించవచ్చు… నామీద అభిమానం ఉండొచ్చు… కానీ ప్రేమ మాత్రం కాదు మామయ్య.”
వరహాలు మొహం కాస్త మసకబారింది.
శ్యామ్ :-
“మరొక విషయం… పెళ్లి అనేది పాపాలు కడిగేసుకోవడానికి చేసే బంధం కాదు. ఇద్దరు మనుషులు మనస్ఫూర్తిగా ఒకరినొకరు కోరుకున్నప్పుడు జరిగేది.”
ఆ మాటలు విన్న ప్రేమ్ గర్వంగా శ్యామ్ వైపు చూశాడు.
శ్యామ్ కొనసాగించాడు.
“మీనాక్షి గారిని నేను ఎప్పుడూ అలా చూడలేదు మామయ్య. ఆమెకి మంచి జీవితం రావాలి… కానీ అది నాతో కాదు.”
వరహాలు తల దించుకున్నాడు.
అతని గుండెల్లో మళ్లీ బాధ చేరింది.
కానీ ఈసారి… శ్యామ్ మీద కాదు.
తన చేసిన తప్పుల మీద.
అప్పుడే…
వంటగది దగ్గర నుండి ఒక చిన్న పాత్ర జారి పడిన శబ్దం వచ్చింది.
అందరూ ఒక్కసారిగా అక్కడికి తిరిగి చూశారు.
రుక్మిణీ వెంటనే తేరుకుని :-
“ఏం లేదు… చేతి జారింది…” అని అంది.
కానీ…
ఆమె కళ్లల్లోని తడి మాత్రం దాచుకోలేకపోయింది.
శ్యామ్ అది గమనించాడు.
ఒక్క క్షణం…
అతని గుండెల్లో తెలియని భయం పుట్టింది.
“రుక్మిణీకి… ఏమైంది…?” అని మనసులో అనుకున్నాడు.
కానీ…
ఆమె మాత్రం అప్పటికే నిర్ణయం తీసుకుంది.
“ఈరోజే… శ్యామ్‌తో ఒక్కసారి మాట్లాడాలి…” అని.
వరహాలు :-
“నిన్ను బలవంతం పెట్టడం నాకు ఇష్టం లేదు బాబు! కానీ ఈ మామయ్యను క్షమిస్తావ్ కదా!” అని అడిగాడు.
శ్యామ్ వెంటనే :-
“మనమంతా కుటుంబమే మామయ్య! ఎల్లుండి నాకు రాష్ట్ర ప్రభుత్వం ఒక అవార్డు ఇవ్వబోతోంది. మీరు మన రాష్ట్ర రాజధానికి తప్పకుండా రావాలి! అత్తయ్యను కూడా తీసుకురావాలి!”
అని చెప్పి వరహాలను ఆలింగనం చేసుకున్నాడు.
ప్రేమ్‌ను వరహాలకు తోడుగా పంపి, జాగ్రత్తగా బస్ ఎక్కించి రమ్మన్నాడు.
వరహాలు అక్కడి నుండి వెళ్లిపోయిన తర్వాత…
శ్యామ్ నెమ్మదిగా వంటగది దగ్గరికి వెళ్లాడు.
రుక్మిణీ మాత్రం తల దించుకుని పాత్రలు సర్దుతున్నట్టు నటిస్తోంది.
శ్యామ్ ఆమె దగ్గరకి వెళ్లి మెల్లగా :-
“నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు! కానీ నా మనసులో నీకు మాత్రమే చోటు ఉంది రుక్మిణీ! నువ్వు ఎక్కువ ఆలోచించకు! సరేనా?” అని అన్నాడు.
ఆ మాటలు విన్న రుక్మిణీ కళ్లల్లో మళ్లీ నీళ్లు తిరిగాయి.
రుక్మిణీ :-
“ఈరోజే నేను ఇంటికి వెళ్లాలి శ్యామ్ గారు! మళ్లీ మిమ్మల్ని ఎప్పుడు చూస్తానో తెలియదు! అసలు చూస్తానో లేదో…” అని దిగులుగా అంది.
శ్యామ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు.
“ఏంటి… ఏం అంటున్నారు రుక్మిణీ గారు?” అని అడిగాడు.
రుక్మిణీ :-
“మా నాన్నగారికి నువ్వంటే ఇష్టం లేదు శ్యామ్! ఆయన ఎప్పటికీ అంగీకరించరు…” అని అంది.
ఆ మాటలు విన్న శ్యామ్ కాసేపు మౌనంగా ఆమెనే చూస్తూ నిలబడ్డాడు.
తర్వాత నెమ్మదిగా చిరునవ్వు నవ్వి :-
“ఎల్లుండి సాయంత్రం నేరుగా మీ ఇంటికే వస్తాను! నేనే ఒప్పిస్తా! మీ నాన్నగారు తప్పకుండా ఒప్పుకుంటారు.” అని ధైర్యంగా అన్నాడు.
అప్పుడే వెనుక నుండి రఘురాం, విశ్వనాథ్, నరసింహం, ప్రేమ్… అందరూ అక్కడికి వచ్చారు.
నరసింహం గట్టిగా నవ్వుతూ :-
“శ్యామ్ నా కొడుకు! నా కొడుకుని కాదనే వాళ్లు ఎవరు?” అని గర్వంగా అన్నాడు.
రఘురాం కూడా ముందుకు వచ్చి :-
“రుక్మిణీ! నువ్వు భయపడకు. అవసరమైతే ముందుగా నేను మాట్లాడతా.” అని అన్నాడు.
విశ్వనాథ్ :-
“ప్రేమ నిజమైనదైతే… దానికి దారి తానే దొరుకుతుంది అమ్మా.” అని అన్నాడు.
అందరూ రుక్మిణీకి ధైర్యం చెప్తున్నారు.
“మన శ్యామ్‌కు ఏం తక్కువ?”
“నీ నాన్నగారు కూడా ఒక రోజు అర్థం చేసుకుంటారు.”
“మేమంతా ఉన్నాం కదా!”
అని ఒక్కొక్కరు ఒక్కోలా ఆమెకి భరోసా ఇచ్చారు.
అయినా…
రుక్మిణీ మనసులోని భయం మాత్రం పూర్తిగా పోలేదు.
ఇంకా…
పద్దు, రఘురాంలు బయల్దేరే సమయం కూడా వచ్చింది.
రుక్మిణీకి అక్కడి నుండి వెళ్లాలి అనిపించడం లేదు.
శ్యామ్‌ను వదిలి అంత దూరం వెళ్లడం అస్సలు ఇష్టం లేదు.
కానీ… వెళ్లక తప్పదు.
శ్యామ్ బయటకి వచ్చి నవ్వుతూ :-
“జాగ్రత్తగా వెళ్లండి రుక్మిణీ గారు!” అని అన్నాడు.
అతని ముఖంలో నవ్వు ఉంది.
కానీ…
అతని కళ్లల్లో మాత్రం దాచిన బాధ కనిపిస్తోంది.
నిజానికి…
శ్యామ్‌కి కూడా రుక్మిణీని అలా వదిలేయాలి అనిపించడం లేదు.
కానీ అతను బాధపడితే… రుక్మిణీ ఇంకా కృంగిపోతుంది అని తెలుసు.
అందుకే సంతోషంగా ఉన్నట్టు నటిస్తున్నాడు.
ఆ విషయం రుక్మిణీకి కూడా అర్థమైంది.
అందుకే…
తన గుండె విరిగిపోతున్నా… ఆమె కూడా ధైర్యంగా నవ్వడానికి ప్రయత్నించింది.
ఎవ్వరూ ఎవరికీ ప్రేమని చెప్పుకోలేదు.
కానీ…
శ్యామ్ తన మేనమామ కూతురిని కేవలం రుక్మిణీ కోసం తిరస్కరించాడు.
రుక్మిణీ కూడా శ్రీకాంత్ లాంటి మంచి కుటుంబం, డబ్బు, గుణం ఉన్న వరుడిని… కేవలం శ్యామ్ కోసం వద్దనుకుంది.
శ్యామ్ దగ్గర ఏమీ లేని రోజుల్లోనే… అతన్ని ప్రేమించింది రుక్మిణీ.
ఇప్పుడు శ్యామ్ గొప్పవాడయ్యాక కాదు.
అందుకే…
ఇప్పుడు శ్యామ్ జీవిత భాగస్వామిగా నిలబడే అర్హత ఒక్క రుక్మిణీకే ఉంది.
ఇద్దరికీ వేరే జీవితాలు ఎంచుకునే అవకాశాలు వచ్చాయి.
కలవకపోవడానికి వెయ్యి కారణాలు ఉన్నాయి.
కానీ… కలిసి ఉండడానికి ఒక్క కారణమే ఉంది.
“ప్రేమ.”
ఒక రచయితగా నేను చెప్పేది కూడా అదే —
• Be a one woman man
• Be a one man woman
రుక్మిణీ వెళ్లిపోయిన తర్వాత…
ఆ ఇంట్లో ఉన్న విశ్వనాథ్, నరసింహం గార్లకి ఒకటే అనిపించింది.
“రుక్మిణీతో పాటు… ఈ ఇంటి నవ్వు కూడా వెళ్లిపోయింది…” అని.
మరోవైపు…
రుక్మిణీ వాళ్ల ఇంట్లో చాలా దిగులుగా కూర్చుంది.
ఆమెని హరిచంద్ర గారు గమనిస్తున్నాడు.
అతని చేతిలో ఏదో పుస్తకం ఉంది.
కానీ రుక్మిణీకి ఇప్పుడు అవేమీ కనిపించడం లేదు.
ఆమె మనసు మొత్తం… శ్యామ్ గురించే ఆలోచిస్తోంది.
హరిచంద్ర నెమ్మదిగా ఆమె పక్కన కూర్చుని :-
“అమ్మా రుక్మిణీ… ఏంటి దిగులుగా ఉన్నావ్?” అని అడిగాడు.
అప్పుడే పక్క నుండి సుమతి వచ్చి వాళ్ల ముందుకు నిలబడింది.
ఆమె చేతులు వెనక్కి పెట్టుకుని… రుక్మిణీ వైపు కోపంగా చూస్తోంది.
రుక్మిణీ తల దించుకుని :-
“ఏమీ లేదు నాన్న… కొంచెం నీరసం గా ఉంది అంతే…” అని అంది.
అప్పుడు హరిచంద్ర గారి గొంతు ఒక్కసారిగా గంభీరంగా మారింది.
:-
“ఇన్ని రోజులు… ఆ శ్యామ్ దగ్గరే ఉన్నావా?” అని గట్టిగా అడిగాడు.
ఆ మాట విన్న వెంటనే…
రఘురాం, పద్దులు కూడా త్వరగా అక్కడికి వచ్చారు.
కానీ…
వాళ్లు కూడా ఏం మాట్లాడలేక తల దించుకుని నిలబడ్డారు.
ఆ రోజుల్లో తండ్రి అంటే కేవలం భయం కాదు…
మర్యాద.
గౌరవం.
విలువ.